పదవి పోయినా తగ్గని 'మమత'.. కేంద్ర మంత్రి విమర్శలు!

  • బెంగాల్ అసెంబ్లీ రద్దుతో మాజీ సీఎం అయిన మమతా బెనర్జీ
  • సోషల్ మీడియా ఖాతాల్లో ఇంకా 'ముఖ్యమంత్రి'గానే గుర్తింపు
  • ఓటమిని అంగీకరించబోనని గతంలోనే ప్రకటించిన దీదీ
  • బుద్ధదేవ్ భట్టాచార్య హుందాతనాన్ని గుర్తు చేస్తున్న రాజకీయ వర్గాలు
  • మమత తీరుపై బీజేపీ నేత సుకాంత మజుందార్ విమర్శలు
పశ్చిమ బెంగాల్ శాసనసభను గవర్నర్ ఆర్.ఎన్. రవి రద్దు చేయడంతో మమతా బెనర్జీ అధికారికంగా 'మాజీ ముఖ్యమంత్రి' అయ్యారు. గురువారం సాయంత్రం ఈ మేరకు ప్రకటన వెలువడింది. అసెంబ్లీ రద్దుతో ఆమె నేతృత్వంలోని కేబినెట్ కూడా రద్దయింది. అయితే, అధికారికంగా పదవి కోల్పోయినప్పటికీ, ఆమె తన సోషల్ మీడియా ఖాతాలైన ఎక్స్ (ట్విట్ట‌ర్‌), ఫేస్‌బుక్‌లలో మాత్రం ఇప్పటికీ 'పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి'గానే తనను తాను పేర్కొంటున్నారు.

ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరదించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజైన మే 5న మమత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ఫలితాలు ప్రజల అసలైన తీర్పును ప్రతిబింబించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. భవానీపూర్ నియోజకవర్గంలో సువేందు అధికారి చేతిలో ఆమె 15,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

కాగా, 2011లో ఎన్నికల ఫలితాల సరళి తృణమూల్‌కు అనుకూలంగా ఉందని తేలగానే, బుద్ధదేవ్ భట్టాచార్య అర్థరాత్రి 1 గంట సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ వాహనంలో రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన, రాజీనామా సమర్పించిన తర్వాత తిరిగి తన పార్టీ (సీపీఎం) ఏర్పాటు చేసిన కారులో ఇంటికి వెళ్లారు. వెళ్లే ముందు తన భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపి, వారిని విధులనుంచి రిలీవ్ చేశారు.

ఈ రెండు సంఘటనలను పోలుస్తూ బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ స్పందించారు. "బుద్ధదేవ్ భట్టాచార్య, మమతా బెనర్జీకి మధ్య పోలికే లేదు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ, బుద్ధదేవ్ నిజాయతీపరుడని, అధికారం కోసం ఎన్నడూ పాకులాడని వ్యక్తి అని నేను అంగీకరిస్తాను" అని ఆయన అన్నారు. ఓటమిని హుందాగా స్వీకరించిన ఒక నాయకుడికి, అధికారం పోయినా అంగీకరించని మరో నేతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Mamata Banerjee
West Bengal
Chief Minister
TMC
BJP
Assembly Elections 2026
Buddadeb Bhattacharya
Suvendu Adhikari
Social Media

More Telugu News